దళిత స్వాతంత్య పోరాటం – మాధవి మిరప
నగరం నడిబొడ్డున
కుల కుతంత్రం మరోసారి
వికృత వికటాట్టహాసం చేసింది
జరిపిన రాక్షస క్రీడా విన్యాసంలో
దళితుల మారణహోమాల సాక్షిగా
పారించిన ఎర్ర సముద్రాన్ని
నల్ల ‘కోట్లు’ తో కప్పేసింది
పల్లెల్లో కత్తులు తొడిగి
తెగబడ్డ కులాహంకారానికి
‘ ధనం ‘ ధరించిన కులం కుట్ర
పహారా కాసింది
న్యాయ దేవత త్రాసులో
ఒకవైపు కులం, వర్గం
మరో వైపు న్యాయం….
ఎప్పటిలానే జాతి , వర్గం వైపే
మొగ్గు చూపింది.
జాత్యహంకారమే గెలిచి
న్యాయాన్ని గేలి చేసింది
సాక్ష్యాలు లేవంటూ
కుల పిచ్చి కుక్కలను
వీధుల్లోకి వదిలింది
మదాంధుడైన మనువు
కొట్టే దెబ్బల్లో
మా మనుషులను మాకే
శత్రువులను చేసే
నూతన సిద్ధాంతాన్ని కనిపెట్టామని
జబ్బులు చరుచుకుంటుంది
ఫరవా లేదు …..
ఈ కొద్దిపాటి మా నైతిక స్థైర్యమే
మీ కుల పునాదుల్ని కదిలిస్తే
అదే మా విజయానికి నాంది
అణచివేతల, అన్యాయాల పొరల్లో
సర్దుబాట్లు మొదలయ్యాయి
భూకంపం వచ్చే రోజు
ఎంతో దూరంలో లేదు
కులాకాశ హర్మ్యాలు
కూకటి వేళ్ళతో కూలే
రోజు తొందరలోనే ఉంది
అనాదిగా కులస్వామ్యమే
నడుస్తున్న ప్రజా స్వామ్యంలో
దళితులంతా ఒక్కటై
మరో స్వాతంత్య్ర పోరాటానికి
పిలుపునిస్తున్నాం ……. రాబోయే
దళిత స్వాతంత్య్రంలో
కులం పోయిందనుకునే వారికి..
వర్గంతో కులం నుంచి దూరం
జరిగిన వారికి,
కుల పీడితులకు తాడితులకు
సమ న్యాయం పంచడమే మాధ్యేయం.
0 comments:
Post a Comment